Sonu Sood: తానేంటో మరోసారి నిరూపించుకున్న సోనూ సూద్!

  • కరోనా కాలంలో ఎంతో సాయం చేసిన సోనూ సూద్
  • బెంగళూరు ఆసుపత్రిలో ఆక్సిజన్ లేదని సమాచారం
  • వెంటనే రంగంలోకి దిగిన సోనూ టీమ్
  • గంటల వ్యవధిలో 22 ప్రాణాలు కాపాడిన వైనం
Sonu Sood is Always Better Example This Incident

గత సంవత్సరం కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అత్యధికంగా వినిపించిన పేరు ఏంటంటే, సోనూ సూద్ పేరే! వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల తరలింపు నుంచి కష్టకాలంలో ఉన్న ఎంతో మందిని ఆయన తన సొంత డబ్బుతో ఆదుకున్నారు.

ప్రత్యేక రైళ్లు, విమానాలను కూడా ఏర్పాటు చేసి బాధితులకు సాయపడ్డ ఆయనకు సైతం ఇటీవల కరోనా సోకింది. అయినా, సోనూ తన సహాయాన్ని ఆపలేదు. తాజాగా బెంగళూరులోని ఆర్క్ హాస్పిటల్ లో ఆక్సిజన్ నిండుకోగా, విషయం తెలుసుకున్న సోనూ, తన టీమ్ ను అలర్ట్ చేసి, రాత్రంతా శ్రమించి, 22 ప్రాణాలను కాపాడి, తానేంటో మరోసారి నిరూపించుకున్నారు.

ఈ విషయాన్ని బెంగళూరు, యహలంక పాత బస్తీ ఇనస్పెక్టర్ సత్యనారాయణ సోనూ సూద్ దృష్టికి తీసుకుని వెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన, వెంటనే తన టీమ్ ను అలర్ట్ చేశారు. అప్పటికే ఆక్సిజన్ కారణంగా ఆసుపత్రిలో ఇద్దరు బాధితులు కన్నుమూయగా, మిగతావారిని కాపాడాలన్న ఆదేశాలు అందాయి. దీంతో గంటల వ్యవధిలోనే సోనూ టీమ్ 15 ఆక్సిజన్ సిలిండర్లను అందించింది.

"ఇది నా కృషి కాదు. నా టీమ్ చేసిన అద్భుతం. కేవలం కొద్దిమంది మాత్రమే సమష్టిగా పనిచేశారు. సత్యనారాయణ నుంచి కాల్ రాగానే, మేము దాన్ని వెరిఫై చేశాము. నిజమని తెలియగానే నిమిషాల వ్యవధిలో పని మొదలైంది. రాత్రంతా ఆసుపత్రికి ఆక్సిజన్ ను అందించేందుకు శ్రమించాం. మేము ఆలస్యం చేసుంటే ఎన్ని ప్రాణాలు పోయుండేవో తెలియదు. ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా హష్ మత్ అనుక్షణం నాతో మాట్లాడుతూ, మిగతా వారిని సమన్వయపరుస్తూ ఆసుపత్రికి సాయం చేశారు. ఇందుకు నాకెంతోగర్వంగా ఉంది" అని ఈ సందర్భంగా సోనూ సూద్ వ్యాఖ్యానించారు.

More Telugu News