RBI: భవిష్యత్తుపై అనిశ్చితి... తక్షణ చర్యలు తప్పనిసరి: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Economy in uncertain and action should be taken says RBI guv
  • ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్
  • బ్యాంకులకు రుణాలిచ్చేలా మరింత వెసులుబాటు
  • మరో ఏడాది పాటు కరోనా కష్టాల ప్రభావం
  • జాగ్రత్తగా ఉండాలన్న శక్తికాంత దాస్
కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనవంతు సహకారాన్ని అందిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తదుపరి ఏడాది పాటూ, ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్ డౌన్ లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయని అభిప్రాయపడ్డారు. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని అన్నారు. ఇండియాలో కేసుల సంఖ్య 2 కోట్లను దాటిన వేళ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించామన్నారు.

ఈ సంవత్సరం మార్చి నాటికి దాదాపుగా పూర్తి నియంత్రణలోకి వచ్చిన కరోనా మహమ్మారి, ఆపై తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించిందని, అయితే, ఇంతవరకూ కేసులు పెరుగుతూనే వచ్చాయి తప్ప, నియంత్రణా చర్యలు కనిపించలేదని ఆయన అన్నారు. ఇక కరోనాను పారద్రోలేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం తమ వద్ద ఉన్న అన్ని వనరులనూ వినియోగిస్తామని అన్నారు. నిన్న మొన్నటి వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో కనిపించిన వేళ, భారత్ బలంగా ఉందని, ఇప్పుడు భారత్ పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు.

అయితే, ఈ మహమ్మారి నుంచి భారతావని బయట పడుతుందన్న నమ్మకం ఉందని శక్తికాంత దాస్ అన్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ లో జరిగిన మధ్యంతర పరపతి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా తామేమీ సంచలన నిర్ణయాలు తీసుకోవాలని భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ద్రవ్య లభ్యత నిమిత్తం ఎటువంటి అటంకాలు లేకుండా చూస్తామని, రెపో రేటును మార్చి 2022 వరకూ ఓపెన్ గానే ఉంచుతామని అన్నారు.

రుణ అవసరాల నిమిత్తం చూసేవారికి సులువుగా రుణాలను అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా ప్రాధాన్యతా అవసరాలను బట్టి రుణాలను అందించాలని శక్తికాంత దాస్ బ్యాంకులను కోరారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు దీర్ఘకాల రెపో నిర్వహణ కింద రూ. 10 వేల కోట్లను అందిస్తామని తెలిపారు. గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియంను ప్రకటిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

భారత భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో ఉందని, దాన్ని తొలగించేందుకు కొన్ని తక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడిన ఆయన, ఇండియా తరఫున విదేశీ మారక ద్రవ్య నిల్వలు ప్రస్తుతం 588 బిలియన్ డాలర్లు ఉన్నాయని, అదే దేశాన్ని కరోనా నుంచి కాపాడుతుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. చిన్న, మధ్య తరహా కంపెనీలకు వన్ టైమ్ వర్కింగ్ కాపిటల్ నిమిత్తం ఇచ్చిన నిధులపై బ్యాంకులు నిబంధనలను సరళతరం చేసేలా ఆదేశాలు ఇచ్చామని శక్తికాంత దాస్ వెల్లడించారు.
RBI
Governer
Shaktikant Das
Corona

More Telugu News