కరోనాతో మరణించిన తండ్రి చితిలో దూకేసిన కుమార్తె!

05-05-2021 Wed 09:49
  • మహమ్మారి సోకి మరణించిన తండ్రి
  • అంత్యక్రియల వేళ కుమార్తె మనస్తాపం
  • 70 శాతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
Daughter Sucide Attempt After Father Died with Corona

కరోనా మహమ్మారి కారణంగా కన్న తండ్రి మరణించాడన్న మనస్తాపంతో ఆయన చితిలోనే దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతి, ఇప్పుడు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఇండియా - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడ నివాసం ఉంటున్న దామోదర్ దాస్ కరోనా సోకి మరణించాడు. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన స్థానిక పంచాయతీ సిబ్బంది, కుమార్తెలు, ఇతర బంధువుల సమక్షంలో చితికి నిప్పంటించారు. ఆ వెంటనే, దామోదర్ దాస్ కుమార్తె శారద చితిపైకి ఉరికింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన బంధుమిత్రులు, ఆమెను బయటకు తీసేలోగానే 70 శాతం కాలిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు, వివరాలు సేకరించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువతి, ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేదని, అందువల్ల ఇంకా స్టేట్ మెంట్ ను నమోదు చేయలేదని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జోధ్ పూర్ ఆసుపత్రికి తరలించామని అన్నారు.