విజయనగరం కలెక్టర్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్... డబ్బులు పంపమంటూ మెసేజ్ లు!

05-05-2021 Wed 09:45
  • ఫేస్ బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు
  • యాడ్ చేసుకున్న వారికి డబ్బు కోసం రిక్వెస్ట్ లు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన హరిజవహర్ లాల్
Vijayanagaram Collector Facebook Account Hack

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్ ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు, పలువురికి డబ్బులు పంపమంటూ మెసేజ్ లు పెట్టారు. దీంతో అనుమానం వచ్చిన కొందరు కలెక్టర్ ను సంప్రదించగా, విషయం బయటపడింది. దీనిపై హరిజవహర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే, కొంతకాలం క్రితం ఆయన ఖాతాను హ్యాక్ చేసిన నేరగాళ్లు, వందలమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టారు. కలెక్టర్ కదా అన్న ఆలోచనతో వారంతా స్నేహితునిగా అంగీకరించిన తరువాత అసలు ప్లాన్ కు తెరలేపారు.

ఒక్కొక్కరికీ మెసేజ్ లు పెడుతూ, తన స్నేహితుడికి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా డబ్బు వేయాలని కోరారు. ఆపై మరుసటి రోజు తిరిగి పంపిస్తానని మెసేజ్ లు చేసేవారు. రూ. 10 వేలు, రూ. 15 వేలు, రూ. 20 వేలు.. చొప్పున పంపమంటూ మెసేజ్ లు వెళ్లాయి.

ఆపై అనుమానం వచ్చిన కొందరు కలెక్టర్ కు ఫోన్ చేసి అడుగగా, అప్పుడే ఆయనకు విషయం తెలిసింది. తాను ఎవరినీ డబ్బులు అడగలేదని, తన పేరిట ఎవరైనా డబ్బు అడిగితే స్పందించ వద్దని కోరారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశానని మీడియాకు వెల్లడించిన ఆయన, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తన ఫేస్ బుక్ ఖాతాను ప్రస్తుతానికి మూసివేశానని తెలిపారు.