ఆరోగ్యమంత్రి జాడ చెబితే రూ. 11 వేల నజరానా: మధ్యప్రదేశ్ కాంగ్రెస్

05-05-2021 Wed 08:58
  • కరోనా ప్రజలు అల్లాడుతుంటే మంత్రి జాడ లేదన్న కాంగ్రెస్
  • నజరానా ప్రకటించిన కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
  • కాంగ్రెస్ ఆరోపణలను కొట్టిపడేసిన బీజేపీ
Congress Claims Madhya Pradesh Health Minister Missing

మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ ప్రభ్‌రామ్ చౌదరి కనిపించడం లేదని, ఆయన ఆచూకీ చెప్పిన వారికి రూ. 11 వేలు బహుమతిగా ఇస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రం కరోనా సంక్షోభంలో చిక్కుకుంటే మంత్రి జాడ మాత్రం కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో ఎవరైనా చెబితే రూ. 11 వేలు బహుమతిగా ఇస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జీతూ పట్వారీ పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో రాష్ట్రానికి ఆయన చేసింది జీరో అని విమర్శించారు.

రాష్ట్రంలో ఓవైపు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని జీతూ పట్వారీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. పట్వారీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ వ్యాఖ్యలు రాజకీయ గిమ్మిక్కులో భాగమేనంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కరోనా వేళ ఆరోగ్యమంత్రితోపాటు ఆ శాఖ తీరికలేకుండా పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రజ్నీష్ అగర్వాల్ పేర్కొన్నారు. పట్వారీ కనుక మంత్రిని కలవాలనుకుంటే నేరుగా ఫోన్ చేయవచ్చని రజ్నీష్ సూచించారు.