దయచేసి మీరు అత్యవసరంగా దిగిపోండి: మోదీకి అరుంధతీరాయ్ లేఖ

05-05-2021 Wed 06:38
  • మా ప్రధానిగా ఉండే నైతిక అర్హత మీకు లేదు
  • మీరు చేయాల్సిన అత్యంత బాధ్యతాయుతమైన పని పదవి నుంచి తప్పుకోవడమే
  • మీరు ఆ పనిచేయకుంటే లక్షలాదిమంది అనవసరంగా చనిపోతారు
  • మీలాంటి వారి వల్ల వైరస్ మరింతగా చెలరేగుతుంది
Arundhati Roy urges PM Modi to resign

దేశంలో ప్రస్తుతం ప్రభుత్వమన్నదే లేదని, ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తమకు అత్యవసరంగా ఓ ప్రభుత్వం కావాలని ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ అన్నారు. కాబట్టి ప్రధాని మోదీ అత్యవసరంగా తన పదవి నుంచి తప్పుకోవాలని, పూర్తిగా కాకున్నా కనీసం తాత్కాలికంగానైనా దిగిపోవాలని ఆమె కోరారు. స్క్రోల్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌కు రాసిన లేఖలో ఆమె మోదీని తూర్పారబట్టారు.

2024 వరకు వేచి ఉండలేమని, నేడు ఎక్కడ పడితే అక్కడ మనుషులు చనిపోతున్నారని అరుంధతీరాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని మరీ కోట్లాదిమంది సహచర పౌరులతో గొంతు కలిపి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడం మీ చేతుల్లో లేదని, ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎదుటివారి నుంచి ప్రశ్నను స్వీకరించలేని ప్రధాని ఉన్నప్పుడు వైరస్ మరింతగా చెలరేగిపోతుందన్నారు.

ఇప్పుడు ప్రధాని కనుక తన పదవి నుంచి తప్పుకోకపోతే తమలో లక్షలాదిమంది అనవసరంగా చనిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పదవి నుంచి దిగిపోవాలని వేడుకున్నారు. ప్రధాని స్థానాన్ని తీసుకోవడానికి ఆ పార్టీలోనే చాలామంది ఉన్నారన్నారు. ప్రస్తుత వైరస్‌కు నిరంకుశత్వాలంటే చాలా ఇష్టమని, మీ అసమర్థత, ఇతర దేశాలు మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఒక సాధికారత కారణమవుతుందని అన్నారు.

కష్టపడి సాధించుకున్న సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని, కాబట్టి దిగిపోవాలని కోరారు. ఇప్పుడు మీరు చేయాల్సిన అత్యంత బాధ్యతాయుతమైన పని అదేనని, మా ప్రధానిగా ఉండే నైతిక అర్హతను మీరు కోల్పోయారని అరుంధతీరాయ్ పేర్కొన్నారు.