Corona testing: ఒకసారి కరోనా నిర్ధారణ అయితే, మరోసారి పరీక్షలు అవసరం లేదు: ఐసీఎంఆర్‌

  • వైరస్‌ నిర్ధారణపై ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలు
  • దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ర్యాపిడ్‌ టెస్టులకు అనుమతి
  • దేశవ్యాప్తంగా ర్యాపిడ్‌ టెస్ట్‌ బూత్‌లు
  • ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు
Govt issues new guidelines for corona testing

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్‌ నిర్ధారణ పరీక్షలపై జాతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకసారి ఆర్‌టీపీసీఆర్‌ లేదా ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తికి మరోసారి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షల(ర్యాట్‌) నిర్వహణకు అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది.

అలాగే దేశవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు అన్ని ప్రాంతాల్లో ర్యాట్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. స్థానిక యంత్రాంగం సూచన మేరకు స్కూళ్లు, కాలేజీలు, సామాజిక కేంద్రాల వంటి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో బూత్‌లను నెలకొల్పుతామని పేర్కొంది. ఇవి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

అలాగే అంతర్రాష్ట్ర ప్రయాణాల సమయంలో లక్షణాలు లేనివారికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపింది. తద్వారా పరీక్షా కేంద్రాలపై ఒత్తిడి తగ్గుతుందని వివరించింది. మొబైల్‌ టెస్టింగ్‌ వ్యాన్ల ద్వారా పరీక్షల్ని విస్తృతం చేయాలని రాష్ట్రాలను కోరింది. జీఈఎం పోర్టల్‌లో మొబైల్‌ వ్యాన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

More Telugu News