కొత్త హీరో అయినా సరే, బలమైన విలన్‌ పాత్ర ఉంటే చేస్తా: విష్వక్ సేన్‌

04-05-2021 Tue 21:41
  • పలు హిట్‌ చిత్రాలతో యువతలో విష్వక్ ‌సేన్ కు క్రేజ్‌
  • తనకు కోపం ఎక్కువన్న యువ హీరో
  • కథ, పాత్రకే ప్రాధాన్యం ఇస్తానన్న విష్వక్ 
  • పారితోషికానికి చివరి ప్రాధాన్యం ఇస్తానంటున్న హీరో
Hero vishwak sen says he is ready to play role of vilain too

ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్‌, హిట్‌ వంటి చిత్రాలతో సినిమా ప్రేమికుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న యువ హీరో విష్వక్ సేన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను కథ, అందులో పాత్రల ఆధారంగానే సినిమాలను ఎంచుకుంటానని తెలిపారు. పారితోషికానికి చివరి ప్రాధాన్యం ఇస్తానన్నారు. అయితే, హీరోగానే కాకుండా ప్రాధాన్యం ఉంటే విలన్‌గా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్త హీరో అయినా సరే, బలమైన ప్రతినాయకుడి పాత్ర ఉంటే చేయడానికి ఏమాత్రం వెనుకాడబోనన్నారు.  

ఇక పొగడ్తలతో ముంచెత్తేవాళ్లు తన పక్కన ఉండొద్దనే కోరుకుంటానన్నారు. వీడు హీరో ఏంట్రా అనేవాళ్లు పక్కన ఉంటేనే అహంకారం దరిచేరదని అభిప్రాయపడ్డారు. అలాగే తాను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటానని, అందుకే అవకాశాలు పొగొట్టుకుంటానన్న వదంతులు తన దృష్టికి వస్తుంటాయన్నారు. కానీ, అవన్నీ నిజం కాదన్నారు. అయితే, తనకు కొంచెం కోపం ఉందని, అప్పుడప్పుడూ ఫోన్లు పగలగొడుతుంటానని తెలిపారు.

విష్వక్‌ నటించిన పాగల్‌ విడుదల కావాల్సి ఉంది. అలాగే ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్‌ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మాతలుగా విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించనున్న ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా సెట్స్‌ పైకి వెళ్లాల్సి ఉంది.