ప్రజల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కలేదు: వైయస్ షర్మిల అనుచరురాలు ఇందిరాశోభన్

04-05-2021 Tue 19:59
  • కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేసిన షర్మిల టీమ్
  • చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు కేసీఆర్ పరిస్థితి ఉందని వ్యాఖ్య
  • కరోనా కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు
KCR has no value for peoples lives says YS Sharmila team

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వైయస్ షర్మిల టీమ్ మరోసారి టార్గెట్ చేసింది. కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావాలని షర్మిల అనుచరురాలు ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు కేసీఆర్ పరిస్థితి ఉందని విమర్శించారు. కరోనా కట్టడికి తక్షణమే నిపుణులతో కమిటీ వేయాలని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రజలు కరోనా బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారని... ప్రజల ప్రాణాలంటే విలువ లేనట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్య మౌలిక వసతుల కోసం కేంద్ర నుంచి వచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పారు. కరోనా కట్టడికి సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్లుగా చేర్చడం సంతోషించదగ్గ విషయమని  అన్నారు.