అమ్మ క్యాంటీన్ ఫ్లెక్సీలను చించేసిన డీఎంకే కార్యకర్తలు.. వేటు వేసిన స్టాలిన్!

04-05-2021 Tue 17:58
  • తమిళనాట ఘన విజయం సాధించిన డీఎంకే
  • అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన డీఎంకే కార్యకర్తలు
  • ఫ్లెక్సీలు చించిన వారిపై కేసు నమోదు
Stalin takes action on his party workers who vandalised amma canteen boards

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో డీఎంకే కార్యకర్తలు కొందరు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారు. చెన్నైలో ఉన్న ఒక అమ్మ క్యాంటీన్ ఫ్లెక్సీని ఇద్దరు డీఎంకే కార్యకర్తలు చించేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఫిర్యాదు అందడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే అధినేత స్టాలిన్ వెంటనే ఆ ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించారు.

దివంగత జయలలితను తమిళ తంబీలు అభిమానంగా అమ్మ అని పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. ఆమె పేరుమీదే పేదలకు ఆహారం అందించేందుకు అమ్మ క్యాంటీన్లను అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్యాంటీన్ల ద్వారా పేదలకు తక్కువ ధరకే ఆహారాన్ని అందిస్తున్నారు.