రవితేజ 'ఖిలాడి' విడుదల వాయిదా!

04-05-2021 Tue 17:26
  • 'క్రాక్'తో హిట్ కొట్టిన రవితేజ
  • వేగంగా వర్క్ చేస్తూ వెళ్లిన 'ఖిలాడి'
  • లైన్లో రెండు సినిమాలు      

Raviteja movie Khiladi Postponed

రవితేజ కథానాయకుడిగా 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మొదలైన దగ్గర నుంచి చకచకా షూటింగు జరుపుకుంటోంది. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అలరించనున్నారు. కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదా వేసుకుంటున్నప్పటికీ, 'ఖిలాడి' తన పనులను చక్కబెడుతూనే వచ్చాడు. ఈ నెల 28వ తేదీన విడుదల ప్రకటించడం వలన, ఆ దిశగా తన దూకుడు చూపుతూనే వచ్చాడు. అయితే ఈ సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడిందనేది తాజా సమాచారం.

ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చుననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' సినిమాతో తొలి హిట్ ను అందుకున్న రవితేజ, చాలా వేగంగా 'ఖిలాడి' సినిమాను రెడీ చేశాడు. అయితే కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటం వలన, ఈ సినిమా విడుదలను ఆపేశారు. ఈ సినిమా తరువాత శరత్ మండవ .. త్రినాథరావు నక్కిన సినిమాలను రవితేజ లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.