Mamata Banerjee: బెంగాల్ హింసాకాండలో 12 మంది మృతి.. ప్రశాంతంగా ఉండాలని కోరిన మమత!

  • ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్ లో హింసాత్మక ఘటనలు
  • శాంతిని ప్రేమించే రాష్ట్రం బెంగాల్ అన్న మమత
  • హింసాత్మక ఘటనల్లో ఎవరూ పాల్గొనొద్దని సూచన
Mamata Banerjee calls for peace and calm

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు బాధాకరమని చెప్పారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. శాంతిని ప్రేమించే రాష్ట్రం బెంగాల్ అని అన్నారు. ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. బీజేపీ ఎంతో టార్చర్ చేసిందని మండిపడ్డారు. హింసాత్మక ఘటనల్లో ఎవరూ పాలుపంచుకోవద్దని చెప్పారు. ఎక్కడైనా గొడవ జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శాంతిభద్రతలను పోలీసులు కాపాడాలని ఆదేశించారు.

మరోవైపు మమత వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందిస్తూ... అందరూ ప్రశాంతంగా ఉండాలని మమత కోరడం మంచి పరిణామమని అన్నారు. రాష్ట్రంలో హింస చల్లారకపోతే తాము ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందని చెప్పారు. విజయం సాధించిన తర్వాత కూడా టీఎంసీ హింసకు పాల్పడటం దారుణమని అన్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారని దాదాపు వెయ్యి గృహాలు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయని మండిపడ్డారు.

More Telugu News