ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి... ప్రమాదకరంగా కరోనా కొత్త వేరియంట్!

04-05-2021 Tue 15:20
  • దేశంలో రెండు అగ్రగామి సంస్థల అధ్యయనం
  • తొలి దశ కంటే సెకండ్ వేవ్ లో కరోనా ఉద్ధృతం
  • 2 నుంచి 2.5 రెట్లు అధిక శక్తిమంతమైన వైరస్
  • కరోనా కొత్త వేరియంట్ కారణంగా పెరుగుతున్న మరణాలు
Study found corona new variant spreads very rapidly

టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో వ్యాప్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకరం అని పరిశోధకులు వెల్లడించారు. ఇది ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి చెందుతోందని, ఆ ముగ్గురి నుంచి అది మరింతమందికి వ్యాపిస్తోందని వివరించారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందని, తొలి దశ కంటే రెండో దశ వైరస్ 2 నుంచి 2.5 రెట్లు అధిక శక్తిమంతమైనదని తెలిపారు.

ఈ కొత్త వేరియంట్ కారణంగా కేసులే కాదు, మరణాలు కూడా పెరుగుతున్నాయని టాటా ఇన్ స్టిట్యూట్ ప్రాజెక్ట్ సమన్వయకర్త సందీప్ జునేజా పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కొవిడ్ మృత్యుఘంటికలు మోగించడానికి గల కారణాలను పరిశోధిస్తున్నామని పరిశోధక బృందం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ఇదే ఊపులో కొనసాగితే జూన్ 1 నాటికి కరోనా మరణాల సంఖ్య అదుపులోకి వస్తుందని పేర్కొంది.