మన సీఎం అందగాడు, స్మార్ట్... కానీ!: రఘురామకృష్ణరాజు

04-05-2021 Tue 14:36
  • సీఎం జగన్ నుద్దేశించి రఘురామ వ్యాఖ్యలు
  • ఇటీవల గురుమూర్తిని అభినందించిన సీఎం జగన్
  • ఆ ఫొటోపై రఘరామ సెటైర్లు, విమర్శలు
  • వీళ్లేమన్నా ప్రత్యేకమా? అంటూ వ్యాఖ్యలు
Raghurama Krishna Raju describes CM Jagan a handsome guy

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల తన విమర్శల్లో మరింత పదును పెంచారు. తన మీడియా ప్రసంగాల్లో సీఎం జగన్ ను ఉద్దేశించిన వ్యాఖ్యలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా మరోసారి తనదైన శైలిలో సీఎంపై విమర్శలు చేశారు. ఇటీవల తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తాడేపల్లిలో సీఎం జగన్ ను కలవడం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్... గురుమూర్తిని అభినందిస్తున్న ఫొటోను రఘురామకృష్ణరాజు ప్రదర్శించారు.

సిగ్గులేని ఫొటో... ఎలా ఇకిలిస్తున్నారో చూడండి అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఫొటో కింద డాక్టర్ గురుమూర్తి అని రాస్తున్నారని, గురుమూర్తి డాక్టర్ కాదని, ఫిజియోథెరపిస్ట్ అని వ్యాఖ్యానించారు. ఇక ఆ ఫొటోలో అందరూ తమ ఎత్తుల వారీగా నిలుచున్నారని, ఎందుకోగానీ సీఎం జగన్ తనకంటే ఎత్తున్నవాళ్లను దూరంగా పెడతారని రఘురామ అభిప్రాయపడ్డారు. తాను కూడా బాగా పొడగరినే కాబట్టి తనను జగన్ అందుకే దూరం పెట్టి ఉంటాడని చమత్కరించారు. మన సీఎం మంచి అందగాడని, స్మార్ట్ అని తెలిపారు. అయితే తనకంటే పొట్టివాళ్లకే బాగా ప్రాధాన్యత ఇస్తారని, ఎందుకో తెలియదని అన్నారు. ఇక, ఆ ఫొటోలో ఉన్న ఒక్కరికీ మాస్కు లేదని, వారేమైనా ప్రత్యేకమైన వ్యక్తులా? అంటూ ప్రశ్నించారు.