సాధారణ బేల్దారీ మేస్త్రీ భార్య... బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విజేత

04-05-2021 Tue 12:41
  • బంకురా నియోజకవర్గంలో చందనా బౌరి విజయం
  • బీజేపీ తరఫున పోటీ చేసిన చందన
  • 4 వేల మెజారిటీతో విజయం
  • నిన్నటివరకు సాధారణ గృహిణిలా ఉన్న చందన
  • నేడు బీజేపీ ఎమ్మెల్యే
Mason wife winner of Bengal assembly elections

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ ప్రభంజనం సృష్టించి 200కి పైగా స్థానాలు కైవసం చేసుకోవడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో, రాజకీయ నేపథ్యం ఏమాత్రం లేని ఓ సాధారణ బేల్దారీ మేస్త్రీ భార్య, అది కూడా బీజేపీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించడం అంటే అది అపూర్వమైన విషయమే. నిన్న మొన్నటి వరకు సాధారణ గృహిణిగా ఉన్న చందనా బౌరి ఈ ఘనత సాధించారు.

సల్తోరా ప్రాంతానికి చెందిన చందనా బౌరి బీజేపీ తరఫున బంకురా నియోజకవర్గంలో పోటీ చేశారు. అర్థ బలం లేదు, మంద బలగం అసలే లేదు... అయినప్పటికీ ఓటర్లు చందనా బౌరిని గెలిపించారు. చందన ఈ ఎన్నికల్లో 4 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన చందనా అఫిడవిట్లో తన ఆస్తిని రూ.31,985గా చూపించారు. మేస్త్రీగా పనిచేసే ఆమె భర్త ఆస్తి రూ.30,311.

చందన విజయంపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ స్పందించారు. అవకాశం రావాలే గానీ, ఎంత పెద్ద కల అయినా అసాధ్యం కాదని, ఎలాంటి లక్ష్యం అయినా కృషి ఉంటే చేరుకోవడం సులభమేనని వ్యాఖ్యానించారు. ఎంతో సాధారణ నేపథ్యం ఉన్న చందనా బౌరికి బెంగాల్ ప్రజలు ఘనంగా మద్దతు పలికి గెలిపించారని వెల్లడించారు. ఇంతకీ ఆమె ఆస్తులు 3 మేకలు, 3  ఆవులు, ఒక గుడిసె మాత్రమేనని అని సత్యకుమార్ వివరించారు.