విచారణలో నా చుట్టూ ఉన్న అధికారులు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు: దేవినేని ఉమ ఆందోళన

04-05-2021 Tue 11:48
  • సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేశాడంటూ ఉమపై ఆరోపణలు
  • ఇప్పటికే రెండుసార్లు విచారించిన సీఐడీ అధికారులు
  • నేడు మూడోసారి విచారణ
  • సీఐడీ కార్యాలయానికి విచ్చేసిన ఉమ
  • కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం
Devineni Uma attends CID questioning for third time

సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, వీడియో మార్ఫింగ్ కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఇవాళ కూడా సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి కింద ఆయన విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్ అందించాల్సింది పోయి, కక్ష సాధింపులకు పాల్పడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలతో ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారని అంటూ మండిపడ్డారు.

విచారణ పేరుతో 9 గంటలు ఖాళీగా కూర్చోబెడుతున్నారని ఉమ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. విచారణ సందర్భంగా తన చుట్టూ ఉన్న అధికారులు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని, ఇప్పటి పరిస్థితుల్లో ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం అని పేర్కొన్నారు. కాగా, దేవినేని ఉమను సీఐడీ అధికారులు ఇప్పటికే రెండు పర్యాయాలు విచారించిన సంగతి తెలిసిందే.