తన సహచర మంత్రులతో నేడు వైఎస్ జగన్ కీలక సమావేశం!

04-05-2021 Tue 11:40
  • కర్ఫ్యూ, కరోనాపై సమీక్షించనున్న జగన్
  • వ్యాక్సినేషన్ కు నిధులపైనా చర్చ
  • అర్చకుల సంక్షేమం తదితర అంశాలు చర్చకు
Crucial AP Cabinet Meeting Today

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నియంత్రణ, బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు, హాస్పిటల్స్ లో పడకల లభ్యత వంటి పలు అంశాలపై చర్చించేందుకు సీఎం వైఎస్ జగన్, నేడు తన మంత్రివర్గ సహచరులతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఆక్సిజన్ కొరత, కరోనా బాధితులకు వాడాల్సిన రెమిడెసివిర్ ఇంజక్షన్లు, టీకాల పంపిణీ ప్రక్రియపైనా జగన్ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, తదుపరి ఆదేశాలు జారీ చేయనున్నారు.

ఇక, 18 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించడం, కొవిన్ తో పాటు ఆరోగ్య సేతు యాప్ ద్వారా లక్షలాదిగా రిజిస్ట్రేషన్ లు రావడంతో వ్యాక్సినేషన్ కు అవసరమైన నిధులపైనా ఏపీ మంత్రివర్గం చర్చించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. టూరిజం మినిస్ట్రీ ఆధ్వర్యంలో అతిథి గృహాలను నిర్వహించే అంశంతో పాటు రామాయపట్నం పోర్టు నిర్మాణం నిమిత్తం బిడ్ల ఖరారు, ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ విషయంలో ఎస్సీ ఎస్టీల భూములను సేకరించాల్సి వస్తే 10 శాతం అదనపు పరిహారంపైనా జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశాలతో పాటు అర్చకుల వేతనాల పెంపు అంశంపైనా జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

వాస్తవానికి క్యాబినెట్ సమావేశం ఈపాటికే జరగాల్సి వుంది. అయితే, కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, మంత్రులు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దీంతో నేటి సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడవచ్చని అధికార వర్గాల సమాచారం.