మా నాన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలి: ధూళిపాళ్ల కుమార్తె వైదీప్తి

04-05-2021 Tue 11:36
  • సంగం డెయిరీ కేసు
  • రాజమండ్రి జైలులో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర
  • నరేంద్రకు అస్వస్థత అంటూ వార్తలు
  • తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు
  • విచారణ పేరిట చాలారోజులు గడిచిపోయాయన్న కుమార్తె
Dhulipalla daughter Videepthi demands her father health status

సంగం డెయిరీ కార్యకలాపాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, ధూళిపాళ్ల అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని ధూళిపాళ్ల కుమార్తె వైదీప్తి డిమాండ్ చేశారు. తన తండ్రితో పాటు జైల్లో ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త కలవరపాటుకు గురిచేస్తోందని అన్నారు. ఇద్దరి ఆరోగ్య వివరాలను తెలపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వైదీప్తి స్పష్టం చేశారు.

కొవిడ్ పాజిటివ్ వ్యక్తులతో నిండిపోయిన జైలులో ఉంచడానికి వారేమీ నేరస్తులు కారని ఆమె వ్యాఖ్యానించారు. విచారణకు సంబంధించి ఇప్పటికే చాలా రోజులు గడచిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.