తెలుగు తెరకి మరో నట వారసురాలు!

04-05-2021 Tue 10:47
  • నిన్నటి తరం హీరోయిన్ గా వాణీ విశ్వనాథ్
  • ఆమె బాటలోనే వర్ష విశ్వనాథ్
  • ఒకేసారి మూడు సినిమాల్లో అవకాశాలు    

New heroin for tollywood industry

చిత్రపరిశ్రమలో వారసుల సందడి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. హీరోలు తమ తనయులను హీరోలుగా పరిచయం చేస్తుంటే, సీనియర్ హీరోయిన్లు తన కుమార్తెలను హీరోయిన్లుగా తెరకి పరిచయం చేస్తుంటారు. అలా టాలీవుడ్ కి ఒక సీనియర్ హీరోయిన్ వారసురాలిగా 'వర్ష విశ్వనాథ్' పరిచయమవుతోంది. ఈ అమ్మాయి నిన్నటి తరం హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కి సోదరి కూతురు. తెలుగులో హీరోయిన్ గా వాణీ విశ్వనాథ్ కొంతకాలం పాటు తన జోరు చూపించారు. ఆమె సినిమాల్లో 'ఘరానా మొగుడు' చెప్పుకోదగిన చిత్రంగా కనిపిస్తుంది.

అలాంటి ఆమె వారసురాలిగా వర్ష విశ్వనాథ్ పరిచయమవుతోంది. ఆల్రెడీ తమిళంలో ఓ మూడు సినిమాలు చేసిన ఈ పిల్ల, తెలుగులోనూ మూడు సినిమాలను లైన్లో పెట్టేసింది. ఒక సినిమాలో ఆమె సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి జోడీగా నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త హీరోయిన్ల మధ్య గట్టిపోటీ ఉంది. ఈ పోటీని తట్టుకుని ఈ అమ్మాయి ఇక్కడ ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి.