కరోనా సోకిన కొడుకుకు వెంటిలేటర్ కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు హైదరాబాద్ వ్యాపారి ఆఫర్ రూ. 50 లక్షలు!

04-05-2021 Tue 10:20
  • అయినా ఒక రోజు తరువాతే వెంటిలేటర్
  • హైదరాబాద్ లో భారీగా పెరిగిన డిమాండ్
  • డిశ్చార్జ్ లేదా మరణిస్తేనే మరొకరికి వెంటిలేటర్
  • పరిస్థితి చేయి దాటుతోందంటున్న వైద్య వర్గాలు
Heavy Demand for Ventilators in Hyderabad and a Business Man Offer 50 Lakhs

"నా కుమారుడికి కరోనా సోకింది. వెంటిలేటర్ అత్యవసరం. లేకుంటే వాడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వెంటిలేటర్ ఇచ్చి, మా వాడి ప్రాణాలు కాపాడితే రూ. 50 లక్షలు ఇస్తాను. దానికి బిల్లు కూడా వద్దు. అంత మొత్తం ఎక్కువని భావిస్తే, మిగిలే డబ్బులతో పేదలకు కరోనా వైద్యం చేయండి" ఇది హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి కార్పొరేట్ ఆసుపత్రులకు ఇచ్చిన ఆఫర్. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే, అంత ఆఫర్ ఇచ్చినా, ఆ వ్యాపారి కుమారుడికి దాదాపు 24 గంటల తరువాత మాత్రమే వెంటిలేటర్ లభించింది. దీన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్ లో ప్రాణాలు నిలిపే వెంటిలేటర్ లకు ఎండ డిమాండ్ ఉందన్న విషయం.

ప్రస్తుతం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఒక్కో వెంటిలేటర్ కోసం దాదాపు 15 మంది కరోనా బాధితులు పోటీపడుతున్న పరిస్థితి. ఇందుకు కారణం తొలి దశలో వెంటిలేటర్ అవసరమైతే నాలుగు రోజుల్లో కోలుకుని సాధారణ స్థితికి వచ్చే వారు. కానీ, రెండో దశలో వెంటిలేటర్ అవసరమైతే, కనీసం రెండు వారాల పాటు వినియోగించాల్సి వస్తోంది. దీంతో ప్రాణాధార యంత్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ఇక వెంటిలేటర్ అవసరమై, డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధమైన వారు కూడా నిరాశ చెందాల్సిన పరిస్థితి. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారికి తాత్కాలికంగా వెంటిలేటర్ బెడ్లకు బదులుగా ఆక్సిజన్ బెడ్లు ఇస్తామని, రెండు మూడు రోజుల తరువాత ఖాళీ అయితే, వెంటిలేటర్ బెడ్లు ఇస్తామని, ఈలోగా ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు ఖరాఖండీగా చెబుతున్నాయి. వెంటిలేటర్ల కోసం ఇంతగా డిమాండ్ పెరగడం ఇంతవరకూ ఎన్నడూ చూడలేదని వైద్యులే చెబుతుండటం గమనార్హం.

ఇక లక్షణాలు లేకుండా, స్వల్ప లక్షణాలతో ఉన్న వారు వైద్యుల సలహాలను తీసుకోకుండానే ఇంట్లో చికిత్సలు తీసుకుంటూ హోమ్ ఐసొలేషన్ కు పరిమితం అవుతున్నారని, వారిలో పరిస్థితి విషమించడంతోనే వెంటిలేటర్ బెడ్లకు డిమాండ్ పెరుగుతోందని వైద్యులు అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఎంతగా విషమించిందంటే, ఎవరైనా కోలుకుంటేనో, లేదంటే చనిపోతేనో మాత్రమే వెంటిలేటర్ బెడ్ ఖాళీ అవుతోంది. ఈ చికిత్సలో కనీసం రోజుకు 20 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. బాధితుడు తనంతట తానుగా ఊపిరి పీల్చుకునే వరకూ చికిత్స అవసరం ఉంటుంది. ఇదే సమయంలో నాలుగు ఆక్సిజన్ బెడ్లపై ఉన్న రోగులకు ఒక నర్స్ అవసరం కాగా, వెంటిలేటర్ బెడ్ పై ఉన్న రోగి సహాయార్థం ఒక నర్సును నియమించడం తప్పనిసరని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.