వ్యాయామం దివ్యౌషధం... కరోనా వేళ నిపుణుల మాట!

04-05-2021 Tue 10:17
  • మనిషిని ఆరోగ్యంగా ఉంచే కసరత్తులు
  • ఇప్పటి జీవనశైలికి అత్యావశ్యకంగా మారిన వ్యాయామం
  • వ్యాధి నిరోధక శక్తి పెంపుకు తోడ్పాటు
  • కరోనా కాలంలో శరీరాన్ని సన్నద్ధంగా ఉంచేందుకు సాయం
  • బ్రిటీష్ జర్నల్ లో అధ్యయనం ప్రచురణ
Fitness exercises reduce corona risk as per experts

మనిషి దేహానికి తగిన వ్యాయామం ఎంత ముఖ్యమో తెలియంది కాదు. ఆధునిక యుగంలోనూ దీనికి తగిన ప్రాముఖ్యత ఉంది. క్రీడల ఆవశ్యకత గురించి అందరూ మాట్లాడేది అందుకోసమే. ఇప్పుడు కొవిడ్ మరణ మృదంగం మోగిస్తున్న సమయంలో శారీరక కసరత్తుల ప్రాధాన్యత మరోసారి తెరపైకి వచ్చింది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

సాధారణంగా హృద్రోగాలు, హై బీపీ, పక్షవాతం, మానసిక కుంగుబాటు, డయాబెటిస్ (టైప్ 2) వంటి రుగ్మతలు దరి చేరకుండా వ్యాయామంతో చెక్ పెట్టవచ్చని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే, నిలకడగా ప్రతిరోజూ వ్యాయామం చేసేవారిలో కరోనా ముప్పు తక్కువగా ఉన్నట్టు కాలిఫోర్నియా మెడికల్ సెంటర్ నిపుణులు పేర్కొంటున్నారు. తమ దైనందిన చర్యల్లో వ్యాయామాన్ని ఓ భాగంగా చేసినవారు, కరోనా సోకినప్పటికీ తేలిగ్గా కోలుకుంటారని రాబర్ట్ సాలిస్ అనే నిపుణుడు పేర్కొన్నారు.

సహజంగానే శారీరక కసరత్తులు చేసేవారిలో వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మరింత పెరుగుతుందని అందరికీ తెలుసు. అయితే, శరీరాన్ని ఓ క్రమపద్ధతిలో శ్రమకు గురిచేసేవారిలో, కరోనా సోకినా, అది ప్రాణం తీసేంతగా ప్రభావం చూపదని సదరు అధ్యయనం చెబుతోంది. అందుకోసం రాబర్ట్ సాలిస్, ఆయన బృందం మొత్తం 48,440 మంది వ్యక్తుల ఆరోగ్య చరిత్రను పరిశీలించింది. వీరందరూ కరోనా బాధితులే. పైగా ఇతరత్రా వ్యాధులకు చికిత్స పొందుతున్నవారే. వీరి వ్యాయామ అలవాట్లకు చెందిన డేటాను ఈ అధ్యయనంలో భాగంగా విశ్లేషించి, వారిని మూడు కేటగిరీలుగా విభజించారు.

వారంలో 150 నిమిషాలు, లేక అంతకంటే ఎక్కువ సమయం వ్యాయామం చేసేవారు, వారంలో 10 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారు, వారంలో 11 నుంచి 149 నిమిషాల పాటు వ్యాయామం చేసేవారిగా వారిని విభజించింది.  ఈ మూడు కేటగిరీల్లో అత్యధికంగా వ్యాయామం చేసేవారికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమే రాలేదట. అసలు వ్యాయామం చేయనివారికి, చాలా తక్కువ సమయం వ్యాయామం చేసేవారికి మాత్రం ఐసీయూ చికిత్స తప్పలేదని, కొందరు మృత్యువాత కూడా పడ్డారని ఈ అధ్యయనంలో గుర్తించారు.

ధూమపానం, ఒబేసిటీ, డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియోవాస్కులార్ వ్యాధులు, క్యాన్సర్ ఉన్నవారి కంటే శరీరానికి తగిన వ్యాయామం ఇవ్వనివారికే కొవిడ్ తో తీవ్రమైన ముప్పు అని రాబర్ట్ సాలిస్, ఆయన బృందం పేర్కొంది. అందుకే ప్రతి వ్యక్తి శరీరానికి తగినంత వ్యాయామం, అది కూడా వారానికి 150 నిమిషాలు తగ్గకుండా శ్రమిస్తే కరోనాను ఎదుర్కొనేందుకు శరీరం తగిన విధంగా సన్నద్ధమవుతుందని వివరించారు.