పుదుచ్చేరి పీఠం తమకే కావాలంటున్న బీజేపీ.. కుదరదు పొమ్మన్న రంగస్వామి

04-05-2021 Tue 08:10
  • 10 స్థానాల్లో ఎన్‌ఆర్ కాంగ్రెస్ విజయం
  • 6 స్థానాల్లో గెలిచిన తమకే సీఎం పీఠం కావాలంటూ బీజేపీ పట్టు
  • చివరికి వెనక్కి తగ్గిన బీజేపీ
BJP Demands puducherry CM seat

ఫలితాలు వెలువడి రెండు రోజులు కూడా కాకముందే పుదుచ్చేరిలో రాజకీయ రగడ మొదలైంది. ఆరు సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ ముఖ్యమంత్రి పీఠం తమకే కావాలంటూ పట్టుబట్టింది. అయితే, అలా ఎంతమాత్రమూ కుదరదని ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ రంగస్వామి తేల్చి చెప్పడంతో బీజేపీ వెనక్కి తగ్గింది.

30 మంది సభ్యులున్న పుదుచ్చేరి శాసనసభలో రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 6, డీఎంకే 6, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 16 మంది ఎమ్మెల్యేల అవసరం కాగా, ఎన్డీయేదే అధికారమని తేలిపోయింది. అయితే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగస్వామి సిద్ధమవుతుండగా, బీజేపీ మెలికపెట్టింది.

ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని పట్టుబట్టింది. అయితే, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, తానే ముఖ్యమంత్రినని, అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమని రంగస్వామి ప్రకటించడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి కూటమి సభ్యులు కోరారు. కాగా, ఈ ఎన్నికల్లో యానాం నుంచి బరిలోకి దిగిన గొల్లపల్లి అశోక్ ఏకంగా సీఎం అభ్యర్థి రంగస్వామిపైనే విజయం సాధించడం విశేషం.