బ్రెజిల్ వేరియంట్ పైనా కొవాగ్జిన్ సత్తా చూపుతోంది: ఐసీఎంఆర్

03-05-2021 Mon 18:25
  • దేశీయంగా తయారైన కొవాగ్జిన్
  • కరోనా నివారణలో సమర్థవంతమైన పనితీరు
  • రెండు డోసులతో బ్రెజిల్ వేరియంట్ ఖతమ్
  • మహారాష్ట్రలో అధికంగా వ్యాప్తిలో ఉన్న బ్రెజిల్ వేరియంట్
ICMR says Covaxin effective on corona Brazilian variant

హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ సమర్థవంతమైన వ్యాక్సిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం భారత్ లో కొవిషీల్డ్ తో పాటు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ పనితీరుపై ఐసీఎంఆర్ అధ్యయనం చేపట్టింది. మొదట్లో కొవాగ్జిన్ యూకే వేరియంట్, బి.1.1.7 వేరియంట్, మహారాష్ట్ర డబుల్ మ్యూటెంట్ వేరియంట్ బి.1.617. వేరింయంట్లపై గణనీయ ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. తాజాగా, కొవాగ్జిన్ బ్రెజిల్ వేరియంట్ (బి.1.1.28.2) కరోనా వైరస్ ను కూడా నిర్మూలిస్తున్నట్టు తెలుసుకున్నారు.

రెండు డోసులు కొవాగ్జిన్ తీసుకున్న వారిలో బ్రెజిల్ వేరియంట్ ను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తి రెట్టింపవుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. కొవాగ్జిన్ కారణంగా మానవ శరీరంలో కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనోగ్లోబ్యులిన్ జి అనే పదార్థం ఉత్పన్నమై, యాంటీబాడీల అభివృద్ధికి తోడ్పడుతున్నట్టు ఐసీఎంఆర్ నిపుణులు పేర్కొన్నారు. భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్రలో నమోదవుతున్న కరోనా కేసులు అత్యధికంగా బ్రెజిల్ వేరియంట్ కారణంగానే వస్తున్నాయి.