టాలీవుడ్ డైరెక్టర్ తో విజయ్ మూవీ!

03-05-2021 Mon 18:01
  • వరుస హిట్లతో విజయ్
  • సెట్స్ పై 65వ సినిమా
  • దిల్ రాజు నిర్మాణంలో కొత్త ప్రాజెక్టు  

Vijay upcoming movie with tollywood director

తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అక్కడి మాస్ ఆడియన్స్ ఆయనను ఒక రేంజ్ లో అభిమానిస్తారు .. ఆరాధిస్తారు. ఇటీవలే విజయ్ చేసిన 'మాస్టర్' వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఒక్కో సినిమాతో తన రికార్డులను తానే క్రాస్ చేస్తూ వెళ్లడం విజయ్ విషయంలో జరుగుతోంది. ప్రస్తుతం ఆయన నెల్సన్ దర్శకత్వంలో తన 65వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను 'దీపావళి'కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే విజయ్ ఓ టాలీవుడ్ దర్శకుడితో భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ... వంశీ పైడిపల్లి. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరంచనున్నది దిల్ రాజు అనేది మరో విశేషం. విజయ్ సినిమాలు తెలుగులోకి విడుదల కావడంలో దిల్ రాజు పాత్ర ముఖ్యమైనది. అందువలన ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే వంశీ పైడిపల్లి దగ్గర ఉన్న ఒక కథను విజయ్ కి వినిపించిన దిల్ రాజు,  విజయ్ తో ఓకే అనిపించాడని చెప్పుకుంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఇందులో వాస్తవమెంతుందో!