సీఎంగా ఈ నెల 5న మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం

03-05-2021 Mon 18:00
  • బెంగాల్ లో టీఎంసీ జయభేరి
  • మూడో పర్యాయం అధికార పీఠంపై టీఎంసీ
  • శాసనసభాపక్ష నేతగా మమతను ఎన్నుకున్న పార్టీ నేతలు
  • ఇవాళ గవర్నర్ ను కలవనున్న మమతా బెనర్జీ
Mamata Banarjee will take oath on Wednesday

వరుసగా మూడో పర్యాయం బెంగాల్ పీఠం చేజిక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోమారు సీఎం పగ్గాలు అందుకోనున్నారు. ఈ నెల 5న ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తృణమూల్ శాసనసభాపక్ష నాయకురాలిగా మమతను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో దీదీ నేటి రాత్రి 7 గంటలకు గవర్నర్ ను కలవనున్నారు. ఈ మేరకు టీఎంసీ నేత పార్థ ఛటర్జీ మీడియా సమావేశంలో వెల్లడించారు.

బెంగాల్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎనిమిది విడతల పాటు సుదీర్ఘంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మమత ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా వంటి హేమాహేమీలు సైతం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, ఎక్కడా తగ్గకుండా ఓ బెబ్బులిలా సత్తా చాటారు.