హరీశ్ శంకర్ ను రంగంలోకి దిగమని చెప్పిన పవన్!

03-05-2021 Mon 17:31
  • పూర్తి స్క్రిప్ట్ వినిపించిన హరీశ్ శంకర్
  • జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్
  • ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్    

Pavan kalyan gave green signal for new script

పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ ఒక సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా ఉంటుందనే విషయాన్ని హరీశ్ శంకర్ ధృవీకరించాడు కూడా. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ .. క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' .. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన తరువాత, హరీశ్ శంకర్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ వాటితో పాటే ఈ సినిమాను కూడా మొదలెట్టేద్దామని పవన్ చెప్పాడట.

ఇటీవల పూర్తి స్క్రిప్ట్ తో పవన్ ను హరీశ్ శంకర్ కలిశాడట. స్క్రిప్ట్ మొత్తం విన్న పవన్ కల్యాణ్ తనకి సంతృప్తికరంగా అనిపించిందని చెప్పాడట. జూలై నుంచి షూటింగు పెట్టుకోమనీ .. నెలకి పది రోజులు తన పోర్షన్ ను షూట్ చేయమని అన్నారట. అందుకు హరీశ్ శంకర్ ఓకే అనేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. అందులో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకి ఒక్కో లుక్ ఉండేలా చూసుకోరు. ఆయన టెన్షన్ లేకుండా వరుస సినిమాలు చేసుకువెళుతుండటానికి ఇదే కారణం. ఈ సినిమాకి 'సంచారి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.