మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారా?... ఆస్ట్రేలియా ప్రధానిపై ధ్వజమెత్తిన ఐపీఎల్ కామెంటేటర్

03-05-2021 Mon 17:22
  • కఠిన నిబంధనలు విధించిన ఆస్ట్రేలియా
  • భారత్ నుంచి వస్తే ఐదేళ్లు జైలు అంటూ ప్రధాని ప్రకటన
  • మండిపడిన మాజీ ఆటగాడు మైకేల్ స్లేటర్
  • మీకెంత ధైర్యం? అంటూ ఆగ్రహం
Michael Slater questions Australia Prime Minister

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా భారత్ నుంచి ఆస్ట్రేలియా వస్తే ఐదేళ్ల జైలు శిక్ష అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించడం తెలిసిందే. అయితే, ఐపీఎల్ లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, కామెంట్రీ బృందంలో ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంలా తయారైంది. తమ ప్రధాని ప్రకటనతో, ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్లాలన్నది వారికి ఓ క్లిష్ట సమస్యలా పరిణమించింది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆటగాడు, ఐపీఎల్ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

"ఆస్ట్రేలియా జాతీయుల భద్రత పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించినట్టయితే మమ్మల్ని స్వదేశానికి వచ్చేందుకు అనుమతించాలి. కానీ మమ్మల్ని రావొద్దంటున్నారు... ఎంత అవమానం! ప్రధాని గారూ... ఇలాంటి ప్రకటనలతో మీ చేతులకు మకిలి అంటించుకుంటున్నారు. అయినా మా పట్ల ఈ విధంగా వ్యవహరించడానికి మీకెంత ధైర్యం? క్వారంటైన్ వ్యవస్థలో మీరెలా మార్పులు చేర్పులు చేస్తారు? ఐపీఎల్ లో పనిచేసేందుకు నాకు ప్రభుత్వ అనుమతి ఉంది. కానీ ఇప్పుడు నేను అదే ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్నాను" అంటూ స్లేటర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అయితే స్లేటర్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు... కరోనా విజృంభిస్తోందని తెలిసి కూడా డబ్బు కోసం ఐపీఎల్ కు వెళ్లినప్పుడు, తిరిగిచ్చేందుకు సొంతంగానే ఏర్పాట్లు చేసుకోవాలని హితవు పలికారు. దీనిపై స్లేటర్ వెంటనే బదులిచ్చాడు. తన బ్రతుకుదెరువు ఇదేనని స్పష్టం చేశారు. ఇంతకుముందు క్రికెట్ ఆడిన కాలంలో ఒక్క పైసా కూడా వెనకేసుకోలేదని పేర్కొన్నాడు.