నందిగ్రామ్ లో రీకౌంటింగ్ చేస్తే చంపేస్తామని ఓ అధికారిని బెదిరించారు: మమతా బెనర్జీ

03-05-2021 Mon 15:49
  • పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ జయభేరి
  • నందిగ్రామ్ లో మమతా ఓటమి
  • స్వల్ప తేడాతో సువేందు గెలుపు
  • నందిగ్రామ్ ఫలితంపై గందరగోళం
  • అధికారికి హెచ్చరికలు వచ్చాయన్న మమత
  • ఈవీఎంలకు ఫోరెన్సిక్ టెస్టులు చేయాలని డిమాండ్
Mamata Banarjee comments on Nandigram result

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించినప్పటికీ, సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం జీర్ణించుకోలేని విషయంగా మారింది. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్వల్ప తేడాతో మమతాను ఓడించారు. ఓ దశలో నందిగ్రామ్ ఫలితంపై గందరగోళం నెలకొంది. చివరికి ఈసీ ప్రకటనతో మమత ఓటమి ఖరారైంది. కాగా, తన ఓటమి పట్ల మమత సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆమె నందిగ్రామ్ ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

"నందిగ్రామ్ లో రీకౌంటింగ్ జరిపితే చంపేస్తామంటూ ఓ రిటర్నింగ్ అధికారికి బెదిరింపులు వచ్చినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆ అధికారి మరొకరికి లేఖ రూపంలో వెల్లడించారు. నందిగ్రామ్ లో ఈవీఎంలకు ఫోరెన్సిక్ పరీక్షలు చేయాలని కోరుకుంటున్నాను" అని మమత తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ, కేంద్ర బలగాలు తమను ఎంతో చిత్రహింసలకు గురిచేశాయని, అయినప్పటికీ తాము శాంతియుతంగానే కొనసాగామని వెల్లడించారు.