ఐపీఎల్ లో కరోనా కలకలం... చెన్నై జట్టుకు కరోనా టెస్టులు!

03-05-2021 Mon 15:31
  • కొవిడ్ బారిన కోల్ కతా ఆటగాళ్లు
  • నేటి ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేత
  • ముందుజాగ్రత్తగా చెన్నై ఆటగాళ్లకు కరోనా పరీక్షలు
  • నేటి సాయంత్రం రిపోర్టుల రాక
  • టోర్నీపై నీలినీడలు
covid tests for csk players

ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ 14వ సీజన్ లో కరోనా కలకలం చెలరేగింది. టోర్నీ ఆరంభానికి ముందు పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడినా, ఆ తర్వాత వారు కోలుకున్నారు. తాజాగా టోర్నీ మధ్యలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మరోసారి కలకలం చెలరేగింది. ఈ నేపథ్యంలో, ముందుజాగ్రత్తగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తానికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ఈ సాయంత్రం 4 గంటల తర్వాత టెస్టు రిపోర్టులు వస్తాయని, ఆ తర్వాతే దీనిపై మాట్లాడగలమని చెన్నై జట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అన్ని ఫ్రాంచైజీల తరహాలోనే తాము కూడా కరోనా టెస్టులు నిర్వహించామని, బీసీసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధోనీ నాయకత్వంలోని చెన్నై జట్టు చివరగా గత శనివారం ముంబయి ఇండియన్స్ తో తలపడింది.

కాగా, కోల్ కతా జట్టులో కరోనా కలకలం రేగడంతో ఇవాళ జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దవడం తెలిసిందే. కోల్ కతా, బెంగళూరు జట్ల మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేశారు.

ఇదే తీరులో మరో రెండు, మూడు జట్లలో కరోనా కేసులు వస్తే టోర్నీ నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా మహమ్మారి ప్రబలంగా వ్యాపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి క్రికెటర్లను అత్యంత కఠినమైన బయో బబుల్ లో కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఆటగాళ్లకు కరోనా సోకుతుండడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.