సబ్బం హరి మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

03-05-2021 Mon 14:59
  • కరోనాతో సబ్బం హరి మృతి
  • సబ్బం హరి కుటుంబానికి సానుభూతి తెలిపిన చంద్రబాబు
  • సబ్బం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా
  • సబ్బం మృతి టీడీపీకి తీరని లోటు అని వ్యాఖ్యలు
Chandrababu responds to Sabbam Hari demise

టీడీపీ ఉత్తరాంధ్ర నేత సబ్బం హరి మృతి చెందడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. కొవిడ్ తో పోరాడుతూ సబ్బం హరి కొద్దిసేపటి కిందటే విశాఖలో మరణించారు. ఈ నేపథ్యంలో, సబ్బం హరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సబ్బం హరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. సబ్బం హరి మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. విశాఖ మేయర్ గా, ఎంపీగా సబ్బం హరి సేవలు మరువలేనివని కొనియాడారు.

1952 జూన్ 1న జన్మించిన సబ్బం హరి... అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1985లో విశాఖ నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1989 ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపులో కీలకపాత్ర పోషించి అధిష్ఠానం గుర్తింపు పొందారు. ఆయన 1995లో విశాఖ నగర మేయర్ అయ్యారు. ఆపై ఎంపీగానూ గెలిచిన ఆయన వివిధ పరిణామాల నేపథ్యంలో 2019లో టీడీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.