ఏపీలో రెండు వారాల పాటు కర్ఫ్యూ... కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు

03-05-2021 Mon 14:11
  • ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ
  • ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకే షాపులు
  • 144 సెక్షన్ అమలు
  • అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు
  • ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు
AP Govt imposes partial curfew for two weeks in state

ఏపీలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎల్లుండి నుంచి అమల్లోకి వచ్చేలా కర్ఫ్యూ విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారు. ఈ సమయంలో ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేస్తారు. అయితే అన్ని రకాల అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. బుధవారం నుంచి 14 రోజుల పాటు ఈ పాక్షిక కర్ఫ్యూ కొనసాగనుంది.

రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఇటీవల కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య పెరుగుతుండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ విషయంలో ఎక్కడిక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. ఈ నేపథ్యంలో, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.

అటు, అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం... మిగతా పరీక్షల పైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.