సెషన్ ఆరంభంలోనే భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్!

03-05-2021 Mon 10:36
  • ప్రారంభమైన మే నెల తొలి ట్రేడింగ్ సెషన్
  • ఓ దశలో 500 పాయింట్లు పైగా పడిపోయిన సెన్సెక్స్
  • ప్రస్తుతం 400 పాయింట్లకు పైగా నష్టం
Heavy Loss for Stock Market in Early Trade

మే నెల తొలి ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలోనే బెంచ్ మార్క్ సూచికలు భారీగా నష్టపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నష్టాలతో పాటు, కరోనా కేసుల ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపగా, ఉదయం 9.30 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పడిపోయి 48,200కు చేరింది. ఆపై స్వల్పంగా రికవరీ అయి, ఉదయం 10.30 గంటల సమయంలో 411 పాయింట్ల నష్టంతో 48,370 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే, ప్రస్తుతం 84.45 పాయింట్లు పడిపోయి 14,546 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఓ దశలో నిఫ్టీ 120 పాయింట్లకు పైగా పతనం కావడం గమనార్హం. సెన్సెక్స్ 30లో డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఆసియన్ పెయింట్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ తదితర కంపెనీలు 0.16 నుంచి 1.70 శాతం లాభాల్లో నడుస్తున్నాయి. ఇదే సమయంలో టీసీఎస్, ఎంఅండ్ఎం, భారీ ఎయిర్ కెల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు 0.07 నుంచి నాలుగు శాతం వరకూ నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల సరళిని పరిశీలిస్తే, అన్ని ఆసియన్ సూచీలు నష్టపోయాయి. నిక్కీ 0.83 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 1.31 శాతం, హాంగ్ సెంగ్ 1.48 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 1.33 శాతం, కోస్పీ 0.39 శాతం, సెట్ కాంపోజిట్ 0.46 శాతం, జకార్తా కాంపోజిట్ 0.83 శాతం, షాంగై కాంపోజిట్ 0.81 శాతం నష్టపోయాయి.