మమత పోటీ చేసేది అక్కడి నుంచేనా?

03-05-2021 Mon 09:49
  • అభ్యర్థులు మరణించడంతో మూడు స్థానాలు ఖాళీ
  • ఏదో ఒక స్థానం నుంచి మమత బరిలోకి
  • శాసన మండలి లేకపోవడంతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తప్పనిసరి
Mamata Banerjee should win as a MLA within six months

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ అధినేత్రి మాత్రం తన ప్రత్యర్థి సువేందు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మమత ఓడినప్పటికీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగాల్‌లో శాసనమండలి లేకపోవడంతో సీఎంగా కొనసాగాలంటే మాత్రం ఆమె ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న చర్చ మొదలైంది.

పోటీలో నిలిచిన అభ్యర్థులు మరణించడంతో రాష్ట్రంలో  మూడు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉత్తర 24 పరగాల జిల్లాలోని ఖర్దాహా స్థానానికి గత నెల 22న పోలింగ్ జరిగింది. ఆ స్థానం నుంచి బరిలోకి దిగిన టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా గెలుపొందారు. అయితే, కరోనా బారినపడిన ఆయన ఏప్రిల్ 25న మృతి చెందారు. అలాగే, జంగీపూర్ ఆర్ఎస్‌పీ అభ్యర్థి, శంషేర్‌గంజ్ కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందడంతో ఆ రెండు చోట్లా ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తంగా మూడు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఈ మూడు చోట్లలో ఏదో ఒక స్థానాన్ని మమత ఎంచుకోవాల్సి ఉంటుంది.