మోదీ, షా  చెప్పేవన్నీ అబద్ధాలేనని తేలింది.. రాజీనామా చేయాలి: యశ్వంత్ సిన్హా

03-05-2021 Mon 09:19
  • ఎన్నికల ప్రచారంలో మమతను అడుగడుగునా అవమానించారు
  • బీజేపీ తీరుతో బెంగాల్ ప్రజల మనోభావాలు గాయపడ్డాయి
  • మోదీ, షాలకు తగిన గుణపాఠం చెప్పారు
West Bengal poll results to impact Uttar Pradesh assembly polls Yashwant Sinha

బెంగాల్‌లో గెలుస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడా పార్టీ అక్కడ ఘోరంగా ఓడిపోయిందని సీనియర్ నేత, తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా ఆ ఇద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీరిద్దరితోపాటు ఆ పార్టీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్, కైలాశ్ విజయ వర్గీయ కూడా రాజీనామా చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు మమతను అడుగడుగునా అవమానించారని, ఇది బెంగాల్ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని అన్నారు. బీజేపీ ఓటమికి అదే ముఖ్యకారణమన్నారు. ప్రజలంతా మమతవైపు నిలిచి మోదీ, షాలకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.

పశ్చిమ బెంగాల్ ఫలితాల ప్రభావం ఉత్తరప్రదేశ్ ఎన్నికలతోపాటు 2024 పార్లమెంట్ ఎన్నికలపైనా ఉంటుందని సిన్హా పేర్కొన్నారు. కాగా, వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సిన్హా బీజేపీ పరిస్థితి, భారత ప్రజాస్వామ్యం రెండూ తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని ఆరోపిస్తూ 2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చారు.