మమత విజయంపై రామ్ గోపాల్ వర్మ వీడియో... నవ్వలేక చస్తున్నారు!

03-05-2021 Mon 09:04
  • బెంగాల్ ఎన్నికలపై తనదైన శైలిలో స్పందన
  • ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు
  • వర్మ క్రియేటివిటీ సూపరంటున్న ఫ్యాన్స్
Varma Video Goes Viral On Mamata Win

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ, ఒక్కోసారి విమర్శలు కొనితెచ్చుకోవడంతో పాటు, మరోసారి అభిమానుల నుంచి ప్రశంసలూ అందుకుంటుంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వర్మ స్పందిస్తూ, ఓ షార్ట్ వీడియోను షూట్ చేయించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

దీనికి 'దీదీ ఓ దీదీ' అని పేరు పెట్టారు. ఇందులో మమతా బెనర్జీతో పాటు నరేంద్ర మోదీ, అమిత్ షాలు నటించారని కామెంట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఓ హ్యాండ్ బ్యాగ్ తో ఒంటరిగా వస్తున్న యువతిపై, వెనుక నుంచి ఓ హై ఎండ్ బైక్ పై వచ్చిన ఇద్దరు అటకాయిస్తారు. ఈలోగా పారిపోయినట్టుగా పరిగెత్తే ఆ యువతి, తన చేతిలోని బ్యాగ్ ను దూరంగా విసిరేస్తుంది. వెంటనే ఆ ఇద్దరు బ్యాగ్ కోసం పరిగెత్తగా, వారు తెచ్చిన బైక్ ను ఎంచక్కా నడుపుకుంటూ వెళ్లిపోతుందా యువతి.

ఈ వీడియోను చూసిన బీజేపీ ఫాలోవర్స్ వర్మపై విరుచుకుపడుతున్నారు. మిగతా వారు మాత్రం వర్మ క్రియేటివిటీని పొగడుతున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి