మమతను ఓడించిన సువేందు అధికారిపై దాడి!

03-05-2021 Mon 08:37
  • నందిగ్రామ్ లో పోటీ పడిన సువేందు, మమత
  • స్వల్ప మెజారిటీతో సువేందు విజయం
  • ఆపై సువేందుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
  • తమకు సంబంధం లేదన్న తృణమూల్ కాంగ్రెస్
Attack on Suvendhu Adhikari After Win Over Mamata

పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీపై అనూహ్య విజయం సాధించిన సువేందు అధికారిపై, హల్దియా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అందుబాటులోని సమాచారం ప్రకారం, ఓ కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చి వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. ఇదే సమయంలో అరామ్ బాగ్ ప్రాంతంలో బీజేపీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ నేతలు, ఈ పనులకు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని ఆరోపించారు.

ఈ ఆరోపణలను ఖండించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ కార్యకర్తలే తమ పార్టీ అరామ్ బాగ్ అభ్యర్థి సుజాతా మోండాల్ ను వెంబడించారని, తలపై కొట్టారని ఆరోపించారు.

కాగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన సువేందు అధికారి, ఆపై బీజేపీలో చేరి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ పడిన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి స్వయంగా మమతా బెనర్జీ బరిలోకి దిగడంతో, ఈ పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఫలితాలు వెల్లడైన తరువాత మాట్లాడిన సువేందు, తాను నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలు, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ట్వీట్ చేశారు.