13న పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు కరోనాతో కన్నుమూత

03-05-2021 Mon 07:52
  • గత నెల 21 వధువుకు కరోనా
  • ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినా దక్కని ఫలితం
  • ఇరు కుటుంబాల్లో విషాదం
Bride died with corona in Hyderabad

మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువు కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూసింది. హైదరాబాద్ శివారులోని ఉప్పల్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక భరత్‌నగర్‌కు చెందిన యువతి (22) ఎంబీఏ చదువుకుంది. రాష్ట్రంలో కరోనా విజృంభణకు ముందే ఆమెకు వివాహం నిశ్చయమైంది.

ఈ నెల 13న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనుల్లో ఇరు కుటుంబాల వారు తీరికలేకుండా ఉన్నారు. గత నెలలో పెళ్లి షాపింగ్ కూడా చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 21న వధువుకు కరోనా సంక్రమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే శుక్రవారం (ఏప్రిల్ 30న) మృతి చెందింది. దీంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం అలముకుంది.