పంజాబ్‌కు మరో ఓటమి.. మయాంక్ అద్భుత ఇన్సింగ్స్ వృథా

03-05-2021 Mon 06:32
  • పంజాబ్‌ను ఓడించి అగ్రస్థానానికి ఢిల్లీ
  • అజేయంగా 99 పరుగులు చేసిన మయాంక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
  • ఆరో స్థానానికి దిగజారిన పంజాబ్
Delhi Capitals Beat Punjab Kings

పంజాబ్ కింగ్స్‌తో ఇక్కడ జరిగిన ఐపీఎల్ 29వ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఆరు విజయాలతో మరోమారు అగ్రస్థానానికి ఎగబాకింది. పంజాబ్ కింగ్స్ 5 పరాజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ వన్‌మ్యాన్ షోతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 58 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 99 పరుగులు చేశాడు. శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు.

అనంతరం 167 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ కేపిటల్స్ 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు పృథ్వీషా (39), శిఖర్ ధవన్ (69, నాటౌట్) గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. ఆ తర్వాత మిగిలిన పనిని స్మిత్ (24), రిషభ్ పంత్ (14), హెట్మెయిర్ (16, నాటౌట్)లు పూర్తిచేసి జట్టుకు విజయాన్ని అందించారు.

పంజాబ్ జట్టు ఓడినప్పటికి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నేడు కోల్‌కతా నైట్‌ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది.