ఈసీ సహకారం లేకపోతే బీజేపీకి 50 సీట్లు కూడా వచ్చేవి కాదు: మమతా బెనర్జీ

02-05-2021 Sun 21:15
  • బీజేపీకి ఈసీ అధికార ప్రతినిధిగా వ్యవహరించింది
  • మా పార్టీ గెలుపుపై ముందు నుంచీ ధీమాగా ఉన్నాం
  • నందిగ్రామ్‌లో నేను ఓడిపోలేదు
  • రీకౌంటింగ్‌ జరపాలని కోరాం
  • బెంగాల్‌ ఫలితాలపై మమతా బెనర్జీ
if there is no support of ec bjp wouldnt have crossed even 50 seats says mamata

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయ దుందుభి మోగించింది. అయితే, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓడిపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. ఈ తరుణంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీదీ ‘ఇండియా టుడే’ ఛానెల్‌కు తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం(ఈసీ)పై తీవ్ర ఆరోపణలు చేశారు.

బీజేపీకి ఈసీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిందని దీదీ ఆరోపించారు. ఈసీ సహకారమే లేకపోతే బీజేపీకి 50 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ చాలా దారుణంగా వ్యవహరించిందన్నారు. అయినప్పటికీ.. తన పార్టీ రెండు వందలకు పైగా సీట్లు సాధిస్తుందన్న విశ్వాసం తనకు ముందు నుంచీ ఉందన్నారు.

నందిగ్రామ్‌లో తాను ఓడిపోలేదని మమత అన్నారు. అక్కడ ట్యాంపరింగ్‌ జరిగిందని ఆరోపించారు. రీకౌంటింగ్‌ జరపాలని అడిగామన్నారు. పోలింగ్‌ రోజు మూడు గంటల పాటు పోలింగ్‌ బూత్‌ బయట కూర్చున్నానని.. చాలా మందిని ఓటు వేయడానికి అనుమతించలేదని ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళతారా అన్ని ప్రశ్నించగా.. ప్రస్తుతానికైతే రీకౌంటింగ్‌ జరపాలని మాత్రమే కోరామన్నారు. వీవీప్యాట్లతో సహా తిరిగి కౌంటింగ్‌ జరపాలని కోరారు. నందిగ్రామ్‌లో బీజేపీ మాఫియా అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.