Nagarjuna Sagar Bypolls: ప్రజల తీర్పును స్వాగతిస్తున్నా: నాగార్జునసాగర్‌ ఫలితాలపై జానారెడ్డి

  • విజయం సాధించిన భగత్‌కు అభినందనలు
  • పార్టీ శ్రేణులు, ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు
  • ప్రజల్లో చైతన్యం నింపడం కోసమే ఈ పోటీ
  • తెరాస కుట్రలకు కాంగ్రెస్‌ ఎదురొడ్డి నిలిచింది
  • గాంధీభవన్‌లో జానారెడ్డి మీడియా సమావేశం
I respect the peoples verdict JanaReddy

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని అక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి అన్నారు. విజయం సాధించిన తెరాస అభ్యర్థి నోముల భగత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఈ ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కౌంటింగ్‌ పూర్తయి ఫలితాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత జానారెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.  

ఒక్క సీటులో పోటీ చేయడం వల్ల ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంగానీ లేదా కూలదోయడంగానీ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్లో అవగాహన కలగజేసేందుకు, చైతన్యపరిచేందుకు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. సోనియా గాంధీ నేతృత్వంలోని హైకమాండ్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ తనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిర్వహించానని తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీని నిలువరించాలని తెరాస శ్రేణులు ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ.. వాటన్నింటినీ ఎదురొడ్డి కాంగ్రెస్‌ పార్టీ తన సత్తా చాటిందని జానారెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో తెరాసకు 47 శాతం, కాంగ్రెస్‌కు 37 శాతం ఓట్లు వచ్చాయన్నారు. రెండు పార్టీల మధ్య తేడా 10 శాతం మాత్రమేనన్నారు. తెరాస సర్వ శక్తులు ఒడ్డినా స్వల్ప తేడాతోనే విజయం సాధించిందన్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ వైభవం కోల్పోలేదని తెలుస్తోందన్నారు. ఇదే ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

More Telugu News