కోయంబత్తూరులో కమల్ హాసన్ ముందంజ... థౌజండ్ లైట్స్ లో ఖుష్బూ ఓటమి

02-05-2021 Sun 17:26
  • తమిళనాడు అసెంబ్లీ పోల్స్ లో డీఎంకే హవా
  • కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన కమల్
  • 14వ రౌండ్ అనంతరం కమల్ కు స్వల్ప ఆధిక్యం
  • థౌజండ్ లైట్స్ లో ఖుష్బూకు ఎదురుగాలి
  • 5 వేల ఓట్లతో వెనుకంజ
Kamal Haasan gets lead and Khushbu trails behind

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం సీట్లు 234 కాగా... డీఎంకే 29 స్థానాలు నెగ్గి 129 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార అన్నాడీఎంకే 8 స్థానాలు నెగ్గి, మరో 67 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం తెలిసిందే. 14వ రౌండ్ ముగిసే సమయానికి కమల్ హాసన్ స్వల్ప ఆధిక్యంలో నిలిచారు. తన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసన్ కంటే 1,189 ఓట్ల ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వనతి శ్రీనివాసన్ బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు.

ఇక, ఈసారి ఎన్నికల బరిలో దిగిన సినీ నటి ఖుష్బూకు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఖుష్బూ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆమె తన సమీప ప్రత్యర్థి డీఎంకే నేత ఎళిలన్ చేతిలో ఓటమి పాలయ్యారు.