బెంగాల్ గెలిచింది... ఇక తప్పుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్

02-05-2021 Sun 16:16
  • పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ జోరు
  • టీఎంసీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్
  • తాను చేస్తున్న పని ఇకపై కొనసాగించలేనన్న పీకే
  • కొంతకాలం విరామం తీసుకుంటానని వివరణ
  • రాజకీయాల్లో తాను వ్యక్తిగతంగా ఫెయిలయ్యానని వ్యాఖ్యలు
Prashant Kishore says he can not continue as election strategist

ఎన్నికల్లో ఎలా గెలవాలో పార్టీలకు సలహాలు, సూచనలు ఇస్తూ దేశంలో సరికొత్త ట్రెండ్ కు ఆద్యుడైన ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం చేశారు. జీవితంలో మరేదైనా చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఎంసీ, డీఎంకేల కోసం పనిచేశారు. ఈ రెండు పార్టీలు తాజా ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నాయి. ఆ రెండు పార్టీల విజయం దాదాపు ఖాయమే.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, ప్రస్తుతం చేస్తున్న పనిని ఇకపై కొనసాగించలేనని వెల్లడించారు. బెంగాల్ గెలిచిందని, అందుకు తాను ఎంత చేయాలో అంతా చేశానని వివరించారు. కొంతకాలం విరామం తీసుకోవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే గతంలో తాను కూడా రాజకీయాల్లోకి వచ్చినా, విఫలం అయ్యానని వెల్లడించారు. బెంగాల్ లో 8 విడతల్లో ఎన్నికలు జరగ్గా.... బీజేపీకి రెండంకెల సీట్లు దాటితే తాను ట్విట్టర్ నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిశోర్ పదేపదే సవాల్ చేశారు. ఆయన సవాల్ కు తగ్గట్టుగానే బీజేపీకి ప్రస్తుతం బెంగాల్ ఓట్ల లెక్కింపులో రెండంకెలకు మించి సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.

ప్రశాంత్ కిశోర్ గతంలో జేడీయూ పార్టీలో చేరినా, ఎన్ పీఏ, ఎన్నార్సీ అంశాల్లో పార్టీ వ్యతిరేక వైఖరి అవలంబించారంటూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.