పశ్చిమ బెంగాల్ అప్ డేట్: 14వ రౌండ్ లో సువేందును వెనక్కినెట్టిన మమత

02-05-2021 Sun 15:27
  • హోరాహోరీగా నందిగ్రామ్ ఓట్ల లెక్కింపు
  • 14వ రౌండ్ లో మమతకు 2,331 ఓట్ల మెజారిటీ
  • బెంగాల్ అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 147 స్థానాలు
  • ప్రస్తుతం 22 స్థానాల్లో నెగ్గి 184 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న టీఎంసీ
Mamata Banrajee leads ahead of Suvendu Adhikari in Nandigram

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 294 స్థానాలు ఉండగా, రెండు స్థానాల్లో అభ్యర్థుల మరణంతో 292 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, అన్ని స్థానాల్లోకెల్లా నందిగ్రామ్ పైనే జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే నందిగ్రామ్ లో సీఎం మమతా బెనర్జీ, ఆమెను సవాల్ చేసిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిల మధ్య హోరాహోరీ నెలకొనడంతో అందరి దృష్టి నందిగ్రామ్ పైనే ఉంది.

తొలుత కొన్ని రౌండ్లలో మమత వెనుకబడగా, సువేందు లీడింగ్ లోకి వెళ్లారు. ఆపై మమత పుంజుకోవడం, మళ్లీ సువేందు దూకుడు ప్రదర్శించడంతో ఇక్కడి ఫలితంపై విపరీతమైన ఉత్కంఠ ఏర్పడింది. ప్రస్తుతం 14వ రౌండ్ పూర్తికాగా సీఎం మమతా బెనర్జీ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఆమె మెజారిటీ 2,331 ఓట్లు.

అటు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 147 స్థానాలు. ప్రస్తుతం ఆ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించి 184 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 4 స్థానాల్లో నెగ్గి 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. లెఫ్ట్ కూటమి 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇతరులకు ఒక స్థానం దక్కింది.

బెంగాల్ లో అధికార టీఎంసీ ప్రభంజనంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. సీఎం మమతా బెనర్జీకి శుభాభినందనలు తెలిపారు. అద్భుత విజయం అని అభివర్ణించారు. ప్రజా సంక్షేమం కొరకు మనం కలిసి పనిచేయడాన్ని కొనసాగిద్దాం మమత అంటూ ఆకాంక్షించారు.