నాగార్జునసాగర్ లో గులాబీ దరహాసం... టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం

02-05-2021 Sun 15:04
  • నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • ఈ నెల 17న పోలింగ్
  • నేడు ఓట్ల లెక్కింపు
  • 18,872 ఓట్ల మెజారిటీతో భగత్ విజయం 
TRS candidate Nomula Bhagat wins Nagarjuna Sagar by polls

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజేతగా నిలిచారు. నోముల భగత్ 18,872 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా 9 రౌండ్ల వరకు భగత్ దూకుడు కొనసాగింది. అయితే ఆ తర్వాత అనూహ్యరీతిలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మూడు రౌండ్ల పాటు జోరు ప్రదర్శించారు. కానీ అది తాత్కాలికమే అయింది.

మిగిలిన రౌండ్లలో భగత్ మళ్లీ పుంజుకోవడంతో గులాబీ దండు మురిసింది. నాగార్జున సాగర్ లో సిట్టింగ్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న పోలింగ్ జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికలో బీజేపీ దరిదాపుల్లో లేకుండా పోయింది.