భారత్​ ను ఆదుకునేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టిన లండన్​ లోని హిందూ దేవాలయం!

02-05-2021 Sun 12:06
  • ‘లండన్ టు ఢిల్లీ బైకథాన్’
  • శ్రీకారం చుట్టిన స్వామి నారాయణ మందిర్ 
  • ఉన్నచోటే ఉండి 7,600 కిలోమీటర్ల సైక్లింగ్ 
  • రూ.5.12 కోట్ల సమీకరణ లక్ష్యం
  • భారీగా ముందుకొస్తున్న ప్రవాసీయులు
  • వారికి తోడుగా బ్రిటన్ వాసుల రైడ్
  • జతకడుతున్న మరిన్ని ఆలయాలు
London to Delhi bikeathon raises cash for Indias Covid crisis

కరోనాతో ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్న భారత్ ను ఆదుకునేందుకు ఇప్పటికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. వాటికి తోచిన సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విదేశాల్లోని ప్రవాస భారతీయులూ తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. బ్రిటన్  రాజధాని లండన్ లో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయమైన శ్రీ స్వామినారాయణ మందిర్.. భారత్ ను ఆదుకునేందుకు ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టింది.


భారత్ కు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో 5 లక్షల పౌండ్ల (సుమారు రూ.5.12 కోట్లు) సమీకరణే ధ్యేయంగా  లండన్ నుంచి ఢిల్లీ వరకు బైకథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నియాస్డెన్ లో ఉన్న ఆ దేవాలయ ప్రాంగణంలో ‘సైకిల్ టు సేవ్ ద లైవ్స్’ పేరిట ఈ బైకథాన్  రైడ్ ను ప్రారంభించింది. బైకథాన్ అన్నారు కదా అని వారు లండన్ నుంచి ఢిల్లీ దాకా ప్రయాణమేమీ చేయరు. దేవాలయాల పరిసరాల్లో ఏర్పాటు చేసిన స్టాటిక్ (స్థిరంగా ఉండేవి) సైకిళ్లను తొక్కుతారు. రెండు రోజుల ఈ కార్యక్రమంలో ఉన్నచోటే ఉండి దాదాపు 7,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కనున్నారు.


భారతీయులతో పాటు అక్కడి దేశస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా 12 స్టాటిక్ సైకిళ్లను గుడి ముందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ఒక్కో వాలంటీర్ 50 నిమిషాల పాటు సైకిల్ ను తొక్కొచ్చు. తన రైడ్ పూర్తయ్యాక ఆ సైకిల్ ను అప్పగించేముందు దానిని 10 నిమిషాల పాటు సదరు రైడరే శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 750 మంది స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి నారాయణ ఆలయ కార్యక్రమం నచ్చి మరికొన్ని దేవాలయాలు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి.