Odisha: ఒడిశాలో లాక్​ డౌన్​.. నిత్యావసరాల కొనుగోలుకూ ఓ కండిషన్​!

  • ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు అన్నీ మూత
  • అరకిలోమీటరు దూరంలోని షాపుల్లోనే సరుకుల కొనుగోలుకు అనుమతి
  • అక్కడికీ నడిచేవెళ్లాలని నిబంధన పెట్టిన ప్రభుత్వం
  • ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే పర్మిషన్
Odisha govt announces 14 day lockdown from May 5 to 19 amid Covid 19 surge

కరోనా ఉద్ధృతి పెరిగిపోతుండడంతో ఆ కేసులను నియంత్రించేలా పలు రాష్టాలు లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఆ జాబితాలో తాజాగా మరో రాష్ట్రం చేరింది. ఒడిశా కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఒడిశాలోనూ రోజూ 5 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వమూ లాక్ డౌన్ ను విధించింది.

ఇవాళ్టి నుంచి మే 19 వరకు 14 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని నవీన్ పట్నాయక్ సర్కార్ ప్రకటించింది. కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ప్రజా రవాణా వ్యవస్థనూ బంద్ పెడుతున్నట్టు స్పష్టం చేసింది. నిత్యవసరాలను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతినిచ్చింది. అయితే, దానికి ఓ షరతు పెట్టింది.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపే ఏది కావాలన్నా కొనుగోలు చేయాలని సూచించింది. అది కూడా అర కిలోమీటరు దూరంలోపున్న షాపులు లేదా కూరగాయల దుకాణాలకే నడుచుకుంటూ వెళ్లాలని తెలిపింది. వైద్య సేవలు, నిత్యావసర సేవలు అందించే వాహనాలపై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 8,015 కొత్త కేసులు నమోదవగా, 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,62,622కు పెరిగింది. మొత్తంగా 2,068 మంది చనిపోయారు.

More Telugu News