Dulipalla: ధూళిపాళ్ల కస్టడీ ఉత్తర్వుల అమలును నిలిపివేసిన హైకోర్టు

  • సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు
  • ఐదు రోజుల పాటు క‌స్ట‌డీకి అనుమ‌తిచ్చిన ఏసీబీ కోర్టు
  • రాజమహేంద్రవరం జైలుకి తరలించాలన్న హైకోర్టు
  • కేసు సోమ‌వారానికి వాయిదా
Dulipalla Police Custody Orders Suspended

సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథం అరెస్ట‌యిన విష‌యం తెలిసిందే. వారిని ఐదు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతినిస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల అమలును ఏపీ హైకోర్టు నిలిపేసింది. అలాగే, వారిని రాజమహేంద్రవరం సెంట్ర‌ల్ జైలుకి తరలించాలని చెప్పింది. ఈ కేసులో త‌దుప‌రి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కాగా, నిన్న వారి ముగ్గురిని జైలు నుంచి విజయవాడకు తరలించి ఏసీబీ కార్యాలయంలో విచారించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నరేంద్ర భార్య‌ జ్యోతిర్మయి మాట్లాడుతూ.. త‌న భర్తను అక్రమంగా కేసులో ఇరికించేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోప‌ణ‌లు చేశారు. ఏ అంశంపై కేసు నమోదు చేశారో కూడా స్పష్టత లేదని తెలిపారు.

అంత‌కుముందు నరేంద్రను రాజమహేంద్రవరం జైలు నుంచి విచార‌ణ నిమిత్తం విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నార‌న్నసమాచారంతో ఆయన కుమార్తె వైదీప్తి నిన్న‌ ఉదయమే అక్కడికి చేరుకుని తన తండ్రితో మాట్లాడ‌నివ్వాల‌ని కోరారు. కారులో ఉన్న‌ తండ్రిని అద్దంలో నుంచి చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఆయ‌న‌తో మాట్లాడ‌తాన‌ని కోరిన‌ప్ప‌టికీ అధికారులు అందుకు అంగీకరించలేదు.


More Telugu News