హ్యాట్రిక్ దిశగా మమతా బెనర్జీ... మెజారిటీ స్థానాల్లో లీడింగ్!

02-05-2021 Sun 10:28
  • 138 చోట్ల ఆధిక్యంలో ఉన్న తృణమూల్
  • ఇంకా వెలువడాల్సిన 33 స్థానాల ట్రెండ్స్
  • అనూహ్య మార్పులు సంభవిస్తేనే బీజేపీకి చాన్స్
Trinamool Runs Towards Mejority in West Bengal

ముచ్చటగా మూడవ సారి పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అధికార పీఠాన్ని అధిగమించే దిశగా నడుస్తున్నారు. ఎనిమిది విడతలుగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 138 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో 33 స్థానాల్లో ఇంకా తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి కాలేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, దానికి 10 స్థానాల దూరంలో తృణమూల్ ఉంది. మరో 33 చోట్ల ట్రెండ్స్ రావాల్సి వుండగా, వాటితో మేజిక్ ఫిగర్ ను మమతా బెనర్జీ సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితాల సరళిలో అనూహ్య మార్పులు సంభవిస్తే తప్ప తృణమూల్ అధికారంలోకి రాకుండా ఆపలేరని భావించవచ్చు.

ఇక తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇప్పటికే మేజిక్ ఫిగర్ ను దాటేసి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో 118 మేజిక్ ఫిగర్ కాగా, డీఎంకే 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరో 14 చోట్ల ట్రెండ్స్ వెల్లడి కావాల్సి వుంది. డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలను ప్రారంభించాయి. అన్ని జిల్లాల కార్యాలయాలతో పాటు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద హడావుడి మొదలైంది.