లస్సీ తాగిన 115 మందికి అస్వస్థత.. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రికి!

02-05-2021 Sun 07:32
  • ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఘటన
  • వారాంతపు సంతలో లస్సీ తాగి తీవ్ర అస్వస్థత
  • బాధితుల్లో 21 మంది చిన్నారులు
Around 100 fall ill after consuming lassi in Odisha

వారాంతపు సంతలో లస్సీ తాగిన 115 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పోడియా మండలంలోని కుర్తి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలో శుక్రవారం వారాంతపు సంత జరిగింది. ఈ క్రమంలో సంతకు వెళ్లిన వారు అక్కడ ఓ దుకాణంలో లస్సీ తాగారు. అర్ధరాత్రి సమయంలో వారంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న ఆరోగ్య సిబ్బంది గ్రామానికి వెళ్లి బాధితులకు వైద్యం అందించారు. కొందరిని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారు తీసుకున్న లస్సీ విషపూరితంగా మారడం వల్లే అస్వస్థతకు గురైనట్టు పోడియా వైద్యాధికారి తెలిపారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, అందరూ కోలుకుంటున్నారని పేర్కొన్నారు. బాధితుల్లో 21 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు చెప్పారు.