CSK: దటీజ్ ముంబై... పొలార్డ్ మెరుపుల ముందు చిన్నబోయిన భారీ స్కోరు!

  • 218 పరుగులు చేసిన చెన్నై జట్టు
  • 27 బంతుల్లో 72 పరుగులు చేసిన అంబటి రాయుడు
  • అంత స్కోర్ నూ ఛేదించిన ముంబై ఇండియన్స్
  • చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన పొలార్డ్
Mumbai Wins Over CSK

విజయ లక్ష్యం 219 పరుగులు... 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ లో ఈ స్కోరును ఛేదించాలంటేనే అవతలి జట్టులో వణుకు పుడుతుంది. అందునా ప్రత్యర్థి జట్టు చెన్నై అంటే... విజయం సాధించడం దాదాపుగా అసాధ్యమనే అనుకోవాలి. అటువంటి అసాధ్యమనుకునే లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు అలవోకగా అధిగమించింది. ఓపెనర్ల భాగస్వామ్యానికి తోడు విధ్వంసకర కీరన్ పొలార్డ్ మెరుపులు చెన్నై సూపర్ కింగ్స్ కు చుక్కలు చూపాయి. గత రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ, చెన్నై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 218 పరుగులు చేసింది. ముంబై బౌలర్లపై విరుచుకుపడిన అంబటి రాయుడు 27 బంతుల్లోనే 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి మొయిన్ అలీ (58 పరుగులు), డు ప్లెసిస్ (50 పరుగులు)లు జత కావడంతో చెన్నై జట్టు స్కోరు 200 పరుగులను దాటేసింది. ఆ తరువాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ లు దూకుడుగానే ఆటను మొదలు పెట్టారు. తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు రావడంతో లక్ష్యం దిశగానే ముంబై సాగుతున్నట్టు అనిపించింది.

అదే సమయంలో ఓ ట్విస్ట్ కేవలం 11 పరుగుల వ్యవధిలో రోహిత్, సూర్యకుమార్, డికాక్ లను చెన్నై బౌలర్లు పెవీలియన్ కు పంపారు. అప్పుడు చెన్నైదే పైచేయిగా కనిపించింది. ఎందుకంటే, కేవలం 62 బంతుల్లో 138 పరుగులు చేయాలి కాబట్టి. సాధారణ పరిస్థితుల్లో ఈ లక్ష్యం ఏ జట్టుకైనా పెద్దదే. అప్పుడు బరిలోకి దిగిన పొలార్డ్, చెన్నై బౌలర్లపై చెలరేగిపోయాడు. గెలుపు బాధ్యతను తనపై వేసుకున్నాడు. వచ్చిన బాల్ ను వచ్చినట్టు బౌండరీకి తరలించాడు. అతనికి మరో హార్డ్ హిట్టర్ శ్యామ్ కరణ్ కూడా తోడవడంతో 44 బంతుల్లోనే 89 పరుగులు వచ్చాయి. ఆ తరువాత శ్యామ్ అవుట్ అయినా, పొలార్డ్ మ్యాచ్  చివరి వరకూ నిలబడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం పొలార్డ్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.


More Telugu News